గాజువాకలో ఘోర ప్రమాదం : ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ, ఇద్దరు దుర్మరణం
విశాఖపట్నం, 15 మార్చి (హి.స.) విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహెచ్పీవీ (BHPV) కూడలి వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు ద
fatal-accident-in-gajuwaka-lorry-rams-into-parked-vehicle


విశాఖపట్నం, 15 మార్చి (హి.స.)

విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహెచ్పీవీ (BHPV) కూడలి వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్పీవీ జంక్షన్ వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ రహదారిపై వరుసగా ఆగి ఉన్నాయి. అదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ధాటికి రెండు కార్లు, మూడు బైకులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గాజువాక వరుణ్ మోటార్స్లో పనిచేస్తున్న రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి ద్విచక్ర వాహనంపై సింహాచలం వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ మరణించగా, స్వప్న అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయట పడింది. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సహాయక చర్యలు - ట్రాఫిక్ జామ్

ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా, బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో, క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande