
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఈ సంక్షోభం కారణంగా భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలం (Airspace) మూసివేయడంతో విమానాల రద్దు తప్పనిసరి అయిందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 4,335 సర్వీసులు, విదేశీ సంస్థలకు చెందిన 1,187 సర్వీసులు కలిపి మొత్తం 5,522 విమానాలు రద్దయ్యాయని ప్రకటించారు.
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం మూసివేయడం వల్ల విమానాలను నడపడం అసాధ్యమని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. విమానాల రద్దు భారీగా ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు అధికంగా ఉన్న సమయంలోనూ సుమారు 2,19,780 మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగించగలిగారని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA), మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం తిరిగి తెరుచుకున్న తర్వాతే విమాన సర్వీసులు యధావిధిగా పునఃప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, దేశీయ విమానయాన రంగంలో పైలట్ల సంఖ్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లోక్సభలో కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన విమానయాన సంస్థల్లో మొత్తం 11,394 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 1,871 మంది మహిళా పైలట్లు ఉండటం విశేషం. విమానయాన రంగంలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుండటం సానుకూల పరిణామమని ప్రభుత్వం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు