
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మార్కెట్లో సహజ
వాయువు (Natural Gas) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఖతార్ (Qatar)లోని కీలకమైన గ్యాస్ హబ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరలు ఏకంగా 25 శాతం మేర పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య కొనసాగుతున్న యుద్దం ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరా కేంద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రాలలో ఒకటైన ఖతార్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడంతో సరఫరా వ్యవస్థలో ఆందోళన మొదలైంది. ఇది నేరుగా ధరల పెరుగుదలకు దారితీసింది.
ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్కు 110 డాలర్ల మార్కును దాటగా, ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరగడం వల్ల ఐరోపా, ఆసియా దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు భారమయ్యే ప్రమాదం ఉంది. రవాణా మార్గాల్లో అస్థిరత కారణంగా గ్యాస్ కంపెనీలు తమ సరఫరా ఒప్పందాలను పున:సమీక్షిస్తున్నాయి. దీందీ రానున్న రోజుల్లో గృహ వినియోగదారులపై కూడా భారం పడనుంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం, ఇతర ప్రపంచ దేశాలు ఈ ఇంధన సంక్షోభాన్ని తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు