
ఢిల్లీ, 19 మార్చి (హి.స.)
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పై ప్రస్తుతం నిర్వహిస్తున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది. రంజాన్ పండుగ, సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్ లాంటి దేశాల మధ్య వర్తిత్వం కారణంగా తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ముఖ్యంగా రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
ఈ కాల్పుల విరమణ బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైనట్లు పాకిస్తాన్ సమాచారం మంత్రి అతవుల్లా తరార్ ప్రకటన చేశారు. వచ్చే సోమవారం అర్ధరాత్రితో ఈ ఒప్పందం ముగుస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సమయంలో సరిహద్దుల నుంచి ఎలాంటి ఉగ్రవాద, డ్రోన్ దాడులు జరగకూడదని పేర్కొన్నారు అతవుల్లా తరార్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి సంఘటన చోటు చేసుకుంటే వెంటనే ఆపరేషన్ పున: ప్రారంభిస్తామని హెచ్చరికలు జారీ చేశారు అతవుల్లా తరార్. దాదాపు 5 రోజుల పాటు పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఉంటుందన్న మాట. ఇది ఇలా ఉండగా, రెండు రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ సంఘటనలో దాదాపు 400 మంది ఆఫ్గనిస్తాన్ అమాయక ప్రజలు మరణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV