
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్
ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ఉత్తర కొరియాకు చెందిన జాతీయ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం.. కొరియాలో అతిపెద్ద వ్యవస్థ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇదే అక్కడ దేశాన్ని పాలించే పార్లమెంటరీ. ఈ నెల 15న ఉత్తర కొరియాలో 15వ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.
ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిమ్ కూటమి ఏకంగా 99.93 శాతం ఓట్లు సాధించింది. అంటే పోటీ చేసిన ప్రతి చోటా ఆయన పార్టీయే గెలిచింది. అయితే, 99.97 శాతం ఓట్లు వచ్చాయని కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 99.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 99.93 శాతం ఓట్లు సాధించిన కిమ్కు వ్యతిరేకంగా మిగతా స్వల్ప శాతం ఓట్లైనా పడ్డాయనుకుంటున్నారేమో.. అక్కడ అంత ఛాన్స్ లేదు. ఆయనకు పడని మిగతా ఓట్లలో 0.0037 శాతం ఓటర్లు సముద్రంలో పని చేస్తుండటంతో ఓటు వేయలేకపోయారు. మిగతా వారిలో 0.00003 ఓటర్లు ఓటు వేయలేదు. ఉత్తర కొరియాలో కిమ్కు వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తే ప్రసక్తే లేదనే సంగతి తెలిసిందే. ఎన్నికలు దీనికి మినహాయింపేమీ కాదు. అక్కడ ప్రతిపక్షం అనేదే ఉండదు. ఎన్నికల్లో గెలవనందుకు కాదు.. అసలు కిమ్ పార్టీకి పోటీగా బ్యాలెట్ పేపర్లో కూడా మరో పార్టీ పేరు, అభ్యర్థి ఉండరు.
కిమ్, అతడి అనుకూల నేతలు ముందుగానే ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అతడినే ఓటర్లు అంగీకరించడం లేదా తిరస్కరించడం మాత్రమే చేయాలి. అంతేకానీ, మరో పార్టీ నేత పోటీలో ఉండరు. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఓటు వేయలేదు అంటే ఆ అభ్యర్థికి నో చెప్పినట్లే అర్థం. ఇలా నో చెప్పే అవకాశం కూడా గతంలో అక్కడ లేదు. 1957 తర్వాత ఇలా నో చెప్పే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి. ఇక, ఈ ఎన్నికల్లో మొత్తం 687 మంది పోటీ చేయగా, అందరూ గెలిచారు. వీరిలో కార్మికులు, రైతులు, మేధావులు, మిలిటరీ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధినేతగా ఉన్న కిమ్ 2011లో అధికారం చేపట్టారు. అప్పటినుంచి ఆయనకు అక్కడ ఎదురే లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..