
న్యూఢిల్లీ, 22 మార్చి (హి.స.) పాకిస్తాన్ మాజీ దౌత్య వేత్త (Pakistan) అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai) నగరాలపై తాము బాంబు దాడులకు దిగుతామని బాసిత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బాసిత్.. అమెరికా తమపై దాడిచేస్తే, తాము వెంటనే భారత్పై దాడి చేస్తామని, ముంబై, ఢిల్లీలను వదిలిపెట్టమని అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని తలబిరుసు వ్యాఖ్యలు చేశారు.
తమ దేశ అణు సంపదను లక్ష్యంగా చేసుకున్నా ఇదే తరహా ప్రతిస్పందన ఉంటుందని అబ్దుల్ బాసిత్ అన్నారు. అయితే ఇది దాదాపు అసాధ్యమైన సందర్భమని అంగీకరిస్తూనే, దీనిని 'వ్యూహాత్మక ఉన్మాదం'గా అభివర్ణించడం గమనార్హం. 2014 నుంచి 2017 వరకు భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్గా పనిచేసిన బాసిత్ నుంచి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ అధికారులకు తమ సమస్యలను పక్కనపెట్టి భారత్ను బెదిరించడం అలవాటుగా మారిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు