
హైదరాబాద్, 22 మార్చి (హి.స.)
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ
ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. కానీ.. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ.. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రూ.7000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకుండా.. పేదల ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. దీనిని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు.
హైదరాబాద్ నగరం సుందరీకరణ కావాలి కానీ.. అది పేదల ఇళ్లను, వారి జీవితాలను దెబ్బతీసేలా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ రూ. లక్షన్నర కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి దానిని మూసేశ్వరంగా మారుస్తున్నారని విమర్శించారు. చివరికి తెలంగాణను అభివృద్ధి చెందకుండా మూసేస్తారని దుయ్యబట్టారు. ఇక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ రంగ నిపుణులు వెదిరె శ్రీరామ్ ప్రజల ఇళ్ల కూల్చివేతలపై కొన్ని ప్రత్యామ్నాయాలను వివరించారు. మూసీనదిలో కాలుష్యం, డ్రైనేజీ వ్యర్థాలు కలవకుండా శుద్ధిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మూసీనీటి నుంచి రైతులు స్వచ్చమైన పంటలను పండించినపుడు మూసీ పునరుజ్జీవం సక్సెస్ అయినట్లుగా భావించాలన్నారు. సిటీ ఏరియాలో మాత్రమే శుద్ధి చేస్తే పైనుంచి వచ్చే సీవరేజ్ అంతా ఎక్కడికి పోతుందన్న ఆలోచన లేకుండా ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..