
నారాయణపేట, 22 మార్చి (హి.స.)
నారాయణపేట,మక్తల్,కొడంగల్
నియోజకవర్గాలో భూములు సస్యశ్యామలం లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చారు. ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వెయ్యి కోట్లు నిధులను కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి.
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మూడు విడతల్లో రూ. 4,885 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించడంతో ఇంజనీరింగ్ విభాగం పనుల్లో వేగం పెంచింది. మొదటి విడత కింద రూ. 2,945 కోట్లతో ప్యాకేజీల వారీగా పనులు జరుగుతున్నాయి. మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద స్టేజీ-1 అప్రోచ్ ఛానల్, పంప్ హౌస్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి సంప్ హౌస్ పూర్తి చేస్తామని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కాట్రేవులపల్లి నుంచి ఉట్కూరు పెద్ద చెరువు వరకు 17 కి.మీ పైపులైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటికే 7 కి. మీ. మేర పనులు పూర్తయ్యాయి. కాచ్వార్ వద్ద భారీ ప్రెషర్ మెయిన్ పైపులను సిద్ధం చేశారు. కొత్తగా నిర్మించే ఆర్థిక భారం తగ్గించేందుకు.. ఉట్కూరు, జాయమ్మ చెరువు, లక్ష్మీపూర్, దౌల్తాబాద్ వంటి 10 ప్రధాన చెరువులను రిజర్వాయర్లుగా మార్చి అనుసంధానిస్తున్నారు. ఈ పథకం ద్వారా మక్తల్ లో 25,783 ఎకరాలు, నారాయణపేటలో 20,472, కొడంగల్ లో 53,745 ఎకరాల్లో భూమి సాగుబడిలోకి వస్తుందని, అందుకు గాను 7 టీఎంసీల నీటిని జూరాల బ్యాక్ వాటర్ నుంచి కాట్రపల్లి పంప్ హౌస్కు రూపొందించారు. ఎత్తిపోయాలని
2014 లోనే జీవో నెంబర 69 ద్వారా అనుమతులు లభించినప్పటికీ, గత దశాబ్ద కాలంగా ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంతో పాటు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంజనీర్లతో సర్వే చేయించి జూరాల బ్యాక్ వాటర్ నుంచి 7 టీఎంసీల నీటిని మళ్లించేలా రీ-డిజైన్ చేయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాల బీడు భూములు పచ్చని పైర్లతో కళకళలాడనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు