
ములుగు, 22 మార్చి (హి.స.)
నీటిని ప్రతి ఒక్కరు నీటి పొదుపుగా వాడటం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవిందరావుపేట మండలం పసర గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సుమలత అధ్యక్షతన సమావేశంలో మంత్రితో పాటు కలెక్ట్ దివాకర్ టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని నేడు జరుపుకోవడం గొప్ప విషయమని తెలిపారు.
ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకున్నప్పుడే భావి తరాల వారికి నీటి ఇబ్బందులు ఏర్పడవని, భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విచ్చలవిడిగా నీటిని వృధా చేయడం వల్ల నేడు నీటిని కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని, చెట్లు పెంచని పక్షంలో రానున్న రోజుల్లో గాలిని సైతం కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు సమీపంలోని చెరువులను కాపాడుతూనే అడవులను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరు చెత్తను విచ్చలవిడిగా పడేయకుండా ప్రత్యేక బుట్టలు ఏర్పాటు చేసుకుని దానిలోనే వేయాలని సూచించారు. ములుగు నియోజకవర్గంలో రెండు కోట్ల 70 లక్షల రూపాయలతో రోడ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, నియోజకవర్గాన్ని అన్ని
రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చొరవ చూపడం జరుగుతున్నదని వివరించారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల వారికి ఆర్థిక సాయం అందించి వివిధ వ్యాపారులలో ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు గేదెలను పెంపకం చేసే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, గేదలను పెంపకం చేసినప్పుడే పాల సమస్య తీరుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డు కలిగిన ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన పక్షంలో ఇందిరమ్మ బీమా పాలసీ కింద ఐదు లక్షల రూపాయల ఎక్స్రేషియా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని, ఇప్పటికీ రేషన్ కార్డు పొందని నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
నూతన పథకాల్లో భాగంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సైతం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఒకే చోట చేరి ఊరు పండుగ జరుపుకోవడానికి గ్రామ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, ఈ కార్యక్రమంతో గ్రామస్తులు అందరూ కలిసి మేలసి ఉండి పండుగ జరుపుకున్నారని, ఇదే కార్యక్రమంలో ఆత్మీయ సమ్మేళనం తరహాలో గ్రామ పెద్దలను సన్మానించడం జరుగుతుందని సీతక్క తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు