
అమరావతి, 23 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక అప్డేట్స్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలుగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల విశిష్టతను, నిధుల సమీకరణను మంత్రి నారాయణ వివరించారు. అమరావతి అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనంపైకి ప్రజలు వెళ్లి మొత్తం అమరావతి నగరాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ అసెంబ్లీ భవనాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, హైకోర్టుతో పాటు మరో ఐదు ఐకానిక్ టవర్లను అత్యద్భుతంగా నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఐకానిక్ భవనాలు కాబట్టి సాధారణ భవనాల కంటే వీటికి ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లోని ఐకానిక్ భవనాల రేట్లతో పోల్చి వీటిని చూస్తున్నామని, ఎస్ఆర్ (SR) రేట్ల ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాజధాని పనుల కోసం భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం సమకూర్చుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో ద్వారా మరో రూ. 11 వేల కోట్లు సమకూర్చుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్