ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు!
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని ఊరి నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దని, వారిని పనులకు, శుభకార్యాలకు పిలవకూడదని దండోరా వేయించారు
Srikakulam


శ్రీకాకుళం జిల్లా, 23 మార్చి (హి.స.)ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ అనాగరికం రాజ్యమేలుతోంది అనడానికి ఈ ఘటన నిదర్శనం. భూ రికార్డ్ రెవెన్యూలో తారుమారు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సామాజిక బహిష్కరణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భూ సంబంధిత విషయాల్లో ఆరోపణలు ఎదుర్కన్న కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తునట్లు గ్రామపెద్దలు, ప్రజలు ప్రకటించారు. కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామస్థులు తీర్మానించారు.

ఆ కుటుంబాన్ని కొండములగాం గ్రామంలో పనులకు, శుభకార్యక్రమాలకు పిలకూడదని దండోరా వేయించారు. సదరు కుటుంబం భూ రికార్డ్ రెవెన్యూలో తారుమారు చేయటం, ఎన్నిసార్లు గ్రామ పెద్దలు చెప్పినా.. పెడచెవిన పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. సామాజిక బహిష్కరణ నేరమని అధికారులు తెలిపారు. అలానే ఇలాంటి చట్ట వ్యతిరేక పనుల నిర్మూలనపై గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలింగించకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande