కులవృత్తుల ఆధారంగా దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టాలి : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్, 23 మార్చి (హి.స.)* *తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి.* న్యూఢిల్లీ లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కల్చూరి అసోసియేషన్స్ (FIKA) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివా
కులవృత్తుల ఆధారంగా దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టాలి : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)*

*తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి.*

న్యూఢిల్లీ లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కల్చూరి అసోసియేషన్స్ (FIKA) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, కర్ణాటక మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, జేడీఎస్ నాయకులు బాల్ రాజ్ గుత్తేదార్, FIKA అధ్యక్షులు కుమార్ గౌడ్ మరియు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో కులవృత్తుల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

భారతదేశంలోనే మొదటిసారి జరుగుతున్న కుల జనగణనలో అన్ని కులవృత్తులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, కులవృత్తి పరంగా సమగ్ర జనగణన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గౌడ్, కర్ణాటకలో ఈడిగ, ఆంధ్రప్రదేశ్‌లో శెట్టి బలిజ, ఈడిగ, తమిళనాడులో నాడార్, కేరళలో బిల్లవ, జైశ్వాల్, హల్వాడియ మొదలైన వివిధ పేర్లతో ఉన్న గౌడ్ సమాజాన్ని “కలాల్” పేరుతో ఒకే కులంగా జనగణన చేయాలని సూచించారు. ఇలా చేస్తే ప్రతి వృత్తిలో ఎంత మంది ఉన్నారో, వారి ఆర్థిక స్థితి ఏమిటో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం, గౌడ్ సమాజానికి నీరా పాలసీ, వైన్ షాపుల్లో రిజర్వేషన్లు, చెట్టు పన్ను రద్దు, ఉచిత TFT లైసెన్సులు వంటి కులవృత్తి ఆధారిత సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నీరా పాలసీని ప్రవేశపెట్టాలని, పామ్ ట్రీస్ (కొబ్బరి, జీలుగ, ఈత, తాటి చెట్ల)ను పెంచాలని మరియు వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిందని, కులవృత్తులపై ఆధారపడిన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణలో అమలైన ఈ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో లేవని, వాటిని దేశవ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ మోడల్ గా అమలు చేయాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande