
హైదరాబాద్, 23 మార్చి (హి.స.)తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు. ఈరోజు(సోమవారం) శాసనమండలిలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. నగరంలో ఉన్న పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తే.. ఆ భూములను మల్టీజోన్స్గా వినియోగించుకోవచ్చని వివరించారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకే మెట్రోను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రూ.15 వేల కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎయిర్పోర్టులకు మెట్రో కనెక్టివిటీ ఉంటుందని.. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. జూన్, జులైలోపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
మూసీ ప్రాజెక్టుతోపాటు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్లకు ఎక్కువ భూమి కూడా అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగా నచ్చితే నజరానా.. లేకపోతే జరిమానా విధించే విధానం ఉండదని చెప్పుకొచ్చారు. గుడ్ గవర్నెన్స్ కాదని.. మాది స్మార్ట్ గవర్నెన్స్ అని వ్యాఖ్యానించారు. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని.. ప్రతిపక్షాలు, ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రతిపక్షాల నేతలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూడొద్దని.. ఏవైనా సూచనలు ఉంటే ఇవ్వండి.. స్వీకరిస్తామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన అత్యంత అవసరమని తెలిపారు. మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా తినే పరిస్థితి లేదని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని..కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన విధానాన్నే తాము కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గుజరాత్లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించిందని ప్రస్తావించారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎవరినీ నిరాశ్రయులను చేయం.. పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు. ప్రతిపక్షాల నేతలు అడ్డుకోవడం తప్పించి.. ఏ సలహా ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరికీ నష్టం కలిగించం.. బాధితులందరినీ ఆదుకుంటామని మాటిచ్చారు. మూసీ పరివాహకంలో ఉన్న అందరికీ మెరుగైన వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్