
ఢిల్లీ.,30 జనవరి (హి.స.) దేశంలో మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగినట్లుగా మరో భారీ కుట్రకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పన్నాగాన్ని ఛేదించారు. ఢిల్లీ సరిహద్దులో లష్కర్ తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ను భద్రతా దళాలు అరెస్ట్ చేసి అతి పెద్ద విజయాన్ని సాధించారు. లేదంటే మరోసారి భారతదేశంలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది.
పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్లో కొత్త లష్కర్ మాడ్యూల్ను ఏర్పాటు చేసేందుకు పనిచేస్తున్న షబ్బీర్ అహ్మద్ లోన్ను ఢిల్లీ సరిహద్దులో భద్రతా సంస్థలు విజయవంతంగా అరెస్టు చేశాయి.
ఒక సమాచారం ఆధారంగా.. ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు రాజధాని సరిహద్దులో పక్కా ప్రణాళికతో ఉచ్చు పన్ని పట్టుకున్నారు. సరిహద్దు అవతల నుంచి అందిన ఆదేశాల మేరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే లక్ష్యంతో ఉగ్రవాది ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది.
షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ తర్వాత విచారణ అధికారులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంకెంత మంది సహచరులు దాగి ఉన్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ