విమానాల ఇంధనంపై VAT తగ్గించండి : సీఎంలకు మంత్రి రామ్మోహన్ రిక్వెస్ట్
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా విమాన ఇంధన (ATF) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు.. ప్రయాణికులపై పడుతున్న అధిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్
Rammohan


న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.)

పశ్చిమాసియాలో కొనసాగుతున్న

యుద్ధం కారణంగా విమాన ఇంధన (ATF) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు.. ప్రయాణికులపై పడుతున్న అధిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక అడుగు వేశారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై విధిస్తున్న VATను తగ్గించాలని కోరుతూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.

ఏప్రిల్ 1వ తేదీన విమాన ఇంధన ధరల సవరణ జరగనుంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో, రేపటి నుండి విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే గమనించిన మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో వ్యాట్ 25 శాతం వరకు ఉండటం గమనార్హం.

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయి. ఢిల్లీలో వ్యాట్ 25 శాతంగా ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సానుకూలంగా స్పందిస్తారని మంత్రిత్వ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 29 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. ముంబై విమానాశ్రయం కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో 18 శాతం పన్ను విధిస్తున్నారు.

ఫిబ్రవరి 28న పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలైనప్పటి నుండి విమాన ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఐఏటీఏ (IATA) గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 27న బ్యారెల్ ఏటీఎఫ్ ధర $99.40 డాలర్లు ఉండగా.. మార్చి 27 నాటికి ఇది ఏకంగా $195.19 డాలర్లకు చేరుకుంది. గత కొన్ని వారాలుగా భారతీయ విమానయాన సంస్థలు పన్ను భారాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల విమానయాన రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande