
ఢిల్లీ., 31 మార్చి (హి.స.)అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గౌహతిలోని అస్సాం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు పార్టీ ‘సంకల్ప పత్రం’ అని పేరు పెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని, భూ జిహాద్కు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు.
అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
మౌలిక సదుపాయాలు: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి.
భూమి సంరక్షణ: బంగ్లాదేశీ మియాల (వలసదారులు) ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం.
చట్టాలు: రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code – UCC) అమలు చేయడం.
ఉపాధి: యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు స్వదేశీ ప్రజల గౌరవ మర్యాదలను కాపాడటం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ