
నార్త్ కివు ప్రావిన్స్ , 05 మార్చి (హి.స.)
కాంగో (Congo) దేశంలో భారీ విషాదం చోటుచేసుకుంది. తూర్పు కాంగోలోని నార్త్ కివు ప్రావిన్స్ (North Kivu Province)లో ఉన్న రుబాయా కోల్టన్ మైనింగ్ (Colton Mining) ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు. మృతుల్లో సుమారు 70 మంది చిన్న పిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేల బలహీనపడిందని, దీంతో మైనింగ్ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయని కాంగో మైనింగ్ శాఖ వెల్లడించింది. సుమారు 100 మీటర్ల వెడల్పున మట్టి, రాళ్లు గని కార్మికులపై పడటంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు.
అయితే, ప్రస్తుతం ఈ మైనింగ్ ప్రాంతం M23 తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి, అంతర్జాతీయ సంస్థలకు కష్టతరంగా మారింది. తిరుగుబాటు దళాలు కేవలం ఐదుగురు మాత్రమే చనిపోయారని చెబుతున్నప్పటికీ.. స్థానిక కార్మికులు మాత్రం తాము స్వయంగా 200 పైగా మృతదేహాలను వెలికితీసినట్లుగా సాక్ష్యాలు చెబుతున్నాయి. రుబాయా (Rubaya) ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కోల్టన్ నిక్షేపాలకు ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాడే కోల్టన్ ఉత్పత్తిలో 15 శాతం ఇక్కడి నుంచే లభిస్తుంది.
కాగా, ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం జనవరిలో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనే సుమారు 200 నుంచి 400 మంది మరణించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, తిరుగుబాటు దళాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మైనింగ్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటోందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV