'మంథని పుష్కర ఘాటు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి': పెద్దపల్లి జిల్లా కలెక్టర్
గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్
Peddapalli collector


పెద్దపల్లి, 10 ఏప్రిల్ (హి.స.)

పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత

సమయంలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో శుక్రవారం వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మంథని, గోలివాడ గోదావరిఖని పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, పుష్కరాల సమయంలో గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రోజుకు 30 వేల మంది భక్తులు వస్తారనే అంచనా తో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద 50 శాతం వరకు శాశ్వత పనులు పూర్తయ్యాయని, అక్కడ స్నానాల ఘాట్, కళ్యాణ కట్ట, పిండ ప్రధానం చేసే స్థలం ఏర్పాటు పనులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చిన తట్టుకునేలా చేపట్టాలన్నారు. సుందిళ్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులు, బ్యారెజీ వద్ద రోడ్డు డబుల్ లైన్ చేయాలన్నారు. మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ సురబండేశ్వర్ స్వామి టెంపుల్ నుండి శివాలయం వరకు ఉన్న ఘాట్ వద్ద ఇన్ & ఔట్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంథని పట్టణంలోని అన్ని దేవాలయాలకు అంతర్గత రోడ్లు నిర్మించాలని, పుష్కర ఘాటు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande