
హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు.
దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు, తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత ఆత్మీయంగా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫామహౌస్కు చేరుకున్న జీవన్ రెడ్డికి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఆయన.. అన్నా.. మీతో కలిసి పని చేయడానికి నన్ను ఆ దేవుడే పంపాడు అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి. గతకొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ఆయన, కేసీఆర్ నాయకత్వమే సరైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇద్దరూ సుదీర్ఘ కాలం పనిచేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకే వేదికపైకి రావడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, రైతు సమస్యలపై కేసీఆర్ పోరాటమే తనను బీఆర్ఎస్ వైపు నడిపించాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్తోతో భేటీ అనంతరం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా పేరున్న జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..