
అమరావతి , 11 ఏప్రిల్ (హి.స.)
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, వారిలో నూతనోత్సాహం నింపుతున్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ పార్టీ శ్రేణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే సమయంలో, పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' (ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు.
పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణా శిబిరాల్లో చంద్రబాబు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ, వారితో నేరుగా సంభాషిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పరిపాలన అంశాలపై తన సుదీర్ఘ అనుభవాన్ని పంచుకుంటున్నారు. గతానుభవాలు, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరుపై కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ స్వీకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi