
చుంచుపల్లి, 13 ఏప్రిల్ (హి.స.)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం చుంచుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 6 నుండి ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి వారం వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు డీ-అడిక్షన్, కౌన్సిలింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములుగా చేసుకుంటూ అవగాహన కల్పిస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమన్నారు. ఈ గ్రామ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించడం, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రమాదాల సమయంలో అంబులెన్స్ సేవలు సమయానికి అందుబాటులో ఉన్నాయా, సమీప ఆస్పత్రులకు కనెక్టివిటీ ఎలా ఉందనే అంశాలను కూడా ఈ గ్రామ సభల ద్వారా సమీక్షిస్తున్నామని వివరించారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను తెలియజేసేలా చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్క శాఖకు సంబంధించిన విషయం కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాద రహిత జిల్లాను సాధించగలమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi