అంబాజీపేట కొర్రపాటివాలెం సమీపంలో వాహనం ఢీకొని యువకుడు మృత్యువాత
వాహనం ఢీకొని వ్యక్తి మరణం
అంబాజీపేట కొర్రపాటివాలెం సమీపంలో  వాహనం ఢీకొని  యువకుడు మృత్యువాత


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

అంబాజీపేట, : ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెం ప్రధాన ద్వారం సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, అంబాజీపేట, నగరం, పి.గన్నవరం ఎస్సైలు షేక్ సుభాని, చైతన్యకుమార్, శివకృష్ణలు తమ బృందంతో ప్రమాదానికి బాధ్యులైన వారిని అర్ధగంట వ్యవధిలోనే గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అంబాజీపేట మండలం వాకలగరువు బుల్లియ్యకాలనీకి చెందిన ముత్తాబత్తుల నాగేంద్రబాబు(26) ద్విచక్రవాహనంపై అమలాపురం గ్రామీణ మండలం బండారులంకలోని అత్తవారి ఇంటికి వెళుతున్నాడు. అమలాపురం శాంతినగర్కు చెందిన నాగవరపు గిరి, ఏలిపే వీరేంద్రకుమార్, షేక్ షబీర్లు ఎదురుగా ద్విచక్రవాహనంలో వస్తూ ఇతన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి సపర్యలు చేసి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వాహన సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ సమయంలో ప్రమాదానికి కారకులైన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సీఐ రుద్రరాజు భీమరాజుతో పాటు ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజి, స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రమాదానికి కారకులను పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుభాని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande