
భూపాలపల్లి, 16 ఏప్రిల్ (హి.స.) హనుమాన్ మాల వేసిన విద్యార్థిని పాఠశాలకు రావద్దని, పరీక్షలు రాయకూడదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి బుధవారం విద్యార్థి పై దురుసుగా ప్రవర్తించింది. దీంతో గురువారం హనుమాన్ దీక్షాపరులు భూపాలపల్లి సింగరేణి ఉన్నత పాఠశాల వద్ద హిందూ సంఘాలు, హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ, ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
హిందువుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయురాలి పై తక్షణమే చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. హనుమాన్ మాల వేసుకున్న 7వ తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాలకు రానీయకుండా అడ్డుకుంటున్న హెడ్ మిస్ట్రెస్ ఝాన్సీ రాణిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ప్రశ్నించిన తల్లిదండ్రులపై కూడా ఆమె దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్ మిస్ట్రెస్ ప్రవర్తన సక్రమంగా లేదని పేర్కొంటూ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఝాన్సీ రాణిని ప్రధానోపాధ్యాయురాలి పదవి నుంచి తొలగించాలని పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు