
భద్రాద్రి కొత్తగూడెం, 16 ఏప్రిల్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం రోడ్లోని రైతు వేదిక వద్ద గురువారం ఉదయం లారీ ట్రాక్టర్ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తుపల్లి వైపు నుంచి అశ్వారావుపేట వైపుకు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీకి చెందిన ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఇదే ఘటనలో పక్కనే ఉన్న ఆటో కూడా బోల్తా పడింది.
అశ్వారావుపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిట్టూరి కృష్ణయ్య(52), ఉట్లపల్లికి చెందిన కొవ్వాసి నాగరాజు(42) లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మడకం సంతోష్ (18), గద్దల వెంకట్రావు (54), మడకం సోమరాజు (45), రమేష్ (42)లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ముగ్గురుని మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు