
నాగర్ కర్నూల్, 16 ఏప్రిల్ (హి.స.)
సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానమని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో గురువారం నాగర్కర్నూల్ పోలీస్ పరేడ్ మైదానంలో అరైన్అ- లైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుందని, కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు.
డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారు తప్పనిసరిగా కళ్లజోళ్లు ఉపయోగించాలని సూచించారు. యువత ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో వాహనాలు నడపాలని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం తాగి డ్రైవింగ్ చేయకపోవడం వంటి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అరైన్అ-లైవ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు