
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణకు ఉన్న 3.13 శాతం ప్రాతినిధ్యాన్ని బేస్లైన్గా పరిగణించాలని, పునర్విభజన తర్వాత కూడా ఈ శాతం తగ్గకుండా చూడాలని కవిత డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే అది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi