ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
Earthquake near koraput odisha, mild tremors felt in paderu araku


ఢిల్లీ, 21 ఏప్రిల్ (హి.స.)ఈశాన్య రాష్ట్రాలను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఉదయం మణిపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో మణిపూర్తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 5:59 గంటలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం మణిపూర్లోని కామ్జాంగ్ జిల్లాలో, భూమికి 62 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, ఈశాన్య ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande