
హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 11 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వీరిద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు.
మైనారిటీల అభ్యున్నతికి కృషి: మంత్రి అజారుద్దీన్
మీడియా పాయింట్ వద్ద అజారుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రికెట్లో కెప్టెన్ను. ఇప్పుడు మా కెప్టెన్ మాత్రం రేవంత్రెడ్డే. రాజకీయాల్లో క్లీన్బౌల్డ్ ఉండదు. ఇక్కడ చూస్తూ ఆడుకుంటూ వెళ్లాలి. నాకు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ. పొలిటికల్ ఫ్యాన్స్నూ పెంచుకుంటా. సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పెద్దలు నా కోసం చాలా చేశారు. ప్రజల కోసం ఇంకా కష్టపడి పనిచేస్తా. మైనారిటీల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారు. నేనూ ఆయన బాటలో నడుస్తా’’ అని పేర్కొన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిలబడతా: కోదండరాం
కోదండరాం మాట్లాడుతూ.. ‘‘పదవులు శాశ్వతం కాదు. మంత్రి పదవి మీద ఆశ లేదు. నేనెప్పుడూ ప్రజల పక్షమే. నాపై గతంలో అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. అయినా నా పని నేను చేసుకుంటూ వెళ్లా. ఫీజు రీయింబర్స్మెంట్, తెలంగాణ ఉద్యమకారులు, ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తా. ఇప్పటివరకు చేస్తున్న పనులను మరింత సమర్థంగా పూర్తిచేయడానికి ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్ జయశంకర్కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకుపోతా. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిలబడతా. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అని కోదండరాం తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్