
హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్