
మెహబూబాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణశివారులో సోమవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (35) అనే వ్యక్తి మానసిక ఆవేదనకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొర్రూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ముందుగా తన ఇద్దరు కొడుకులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ముగ్గురు వేప చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దారుణ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో తొర్రూరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు