
చిత్తూరు, 28 ఏప్రిల్ (హి.స.)చిత్తూరు జిల్లాలోని పలు మండలాలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి.మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పర్యావరణ వేత్తలను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం, తవణంపల్లెలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపంజాణిలో 42.9, పలమనేరులో 41.9, గంగవరంలో 41.7, శ్రీరంగరాజపురంలో 41.3, రొంపిచెర్లలో 41.2, బంగారుపాళ్యంలో 41.0, గుడిపాల, పులిచెర్ల, వెదురుకుప్పంలో 40.8, నిండ్రలో 40.7, శాంతిపురంలో 40.6, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
వేసవి ప్రారంభంలోనే ఎండలు ముదురుతాయని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల దెబ్బకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మధ్యాహ్నం వేళల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేడి సెగలు, ఈదురు గాలుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బ తగిలి ఆసుపత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV