
అనంతపురం, 28 ఏప్రిల్ (హి.స.): బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఎంపీలు బీకే పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ ఇతర నేతలతో కలిసి ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. విప్ కాలవ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీని విమర్శించడమే లక్ష్యంగా రాయలసీమ బీసీ గళం నిర్వహించారన్నారు. దశాబ్దాలుగా బలహీనవర్గాలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న వారు, వారి వారసులు సభలో కనిపించారన్నారు.
ఈ సభ జగన్ బలగం.. రాయలసీమ రెడ్ల దళంగా కనిపించిందన్నారు. బీసీ గళంలో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర నేతలంతా బీసీలను అణచివేసిన దుష్టశక్తులని మండిపడ్డారు. ఇలాంటి నేతల గళం బీసీ గళం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీసీలు, దళితులు, మైనార్టీలు ఇలా అందరికీ వైసీపీ అన్యాయం చేసిందన్నారు. ఎంపీ బీకే పార్థసారధి మాట్లాడుతూ... టీడీపీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అప్పుడే అన్నికులాల వారికి ఎమ్మెల్యే, మంత్రి పదవులు దక్కాయన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే బీసీలకు న్యాయం చేకూరుతోందన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఐదేళ్ల పాలనలో జగన్ పార్టీ.. బీసీలను అనేక రకాలుగా హింసించిందన్నారు. ఇప్పుడేమో వైసీపీ నేతలు అసత్యాలు పలుకుతున్నారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV