
హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)
రష్యా నుంచి నాల్గో విడత అత్యాధునిక ఎస్-400 గగనతల వ్యవస్థలు భారత్కు చేరేందుకు సిద్ధమయ్యాయి. మే రెండో వారంలో భారత్కు రష్యా వీటిని డెలివరీ చేయనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. గతవారమే రష్యాలో షిప్పింగ్కు సిద్ధంగా ఉన్న S-400 వ్యవస్థలను భారత వాయుసేన ఉన్నతాధికారులు తనిఖీ చేశారని పేర్కొన్నాయి. పాకిస్థాన్ నుంచి వచ్చే ముప్పును నిర్మూలించేందుకు రాజస్థాన్లోని సరిహద్దు వెంబడి వీటిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతీ ముప్పును ఈ ఎస్-400లోని క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో అడ్డుకున్నాయి. అందుకు గుర్తుగా ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం రోజునే వీటిని భారత్కు డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు.
మరో ఐదు ఎస్-400లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
రష్యాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఐదో, చివరి విడత ఎస్-400లు నవంబర్లో భారత్కు చేరనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ మొత్తం 11 దీర్ఘశ్రేణి ఎస్-400 క్షిపణులను ప్రయోగించి, పాక్ యుద్ధవిమానాలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రవాణా విమానాలతో సహా పలు వైమానిక ముప్పులను నిర్వీర్యం చేసినట్లు సమాచారం. అప్పుడు ఇవి ప్రదర్శించిన సామర్థ్యాన్ని చూసిన తర్వాత మరో ఐదు ఎస్-400లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వేళ ఎస్-400 అద్భుతంగా పనిచేసింది. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఊపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించింది లేదు. అంతకు ముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. కానీ, ఎస్-400 గగనతల వ్యవస్థలో వాడే నాలుగు రకాల క్షిపణుల్లో 40ఎన్6 రేంజి 400 కిలోమీటర్లు దూరం వెళ్లనుంది. దీనిని ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన పూర్తిస్థాయిలో వినియోగించింది. ఈ వ్యవస్థకు భయపడి పాక్ తమ ఎఫ్-16 ఫైటర్ జెట్లు, చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించిందంటేనే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్, చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు.
ఇదిలా ఉండగా, ఐదు ఎస్-400 ట్రయంఫ్ రెజిమెంట్ల విషయంలో భారత్ 2018 అక్టోబర్ 5న రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.40వేల కోట్లు. 'కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్' (CAATSA) నిబంధనల కింద ఈ ఒప్పందంతో ముందుకు సాగితే అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించినప్పటికీ, భారత్ ఏడేళ్ల క్రితమే S-400 క్షిపణుల సేకరణ ఒప్పందంపై సంతకం చేసింది. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం ఐదు ఆర్డర్లను అందజేయాల్సింది. కానీ, ఇప్పటి వరకు మూడు చేరుకోగా, నాలుగో ఆర్డర్ వచ్చే నెలలో, చివరిది నవంబర్ నాటికి ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi