
కలకత్తా, 29 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమబెంగాల్ (West Bengal) లో బుధవారం రెండో విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తాను బరిలో నిలిచిన భవానీపూర్ (Bhavanipur) నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) వెళ్లారు. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన వచ్చేసరికి అక్కడే కూర్చొని ఉన్న మమతను ఉద్దేశించి.. ‘ఆమెను చూడండి. ఆమెకు ఈరోజు ఎవరూ ఓటేయరు’ అని వ్యాఖ్యానించారు.
దాంతో బీజేపీపై, ఎన్నికల సంఘంపై సీఎం మమత విమర్శలు చేశారు. కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు తమ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తృణమూల్ కార్యకర్తను రాత్రి తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఇదేం గూండాయిజమని ప్రశ్నించారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ అని, కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారని మమత మండిపడ్డారు.
కాగా సీఎం మమతాబెనర్జి గూండాగిరి చేస్తున్నారని సువేంధు అధికారి విమర్శించారు. ఆమె గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi