
న్యూఢిల్లీ, 08 ఏప్రిల్ (హి.స.)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా
నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంటే, మరోవైపు వరుస ఓటములతో కుంగిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్లోనైనా గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది. సొంత గడ్డపై ఆడుతుండటం ఢిల్లీకి అదనపు బలంగా మారనుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రావడం టీమ్ కు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. గత రెండు మ్యాచ్లకు కండరాల నొప్పి కారణంగా దూరమైన గిల్, నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నట్టు సమాచారం.
. వ
రుసగా రెండు ఓటములు చవిచూసిన గుజరాత్ జట్టుపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. గిల్ లేని లోటు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కెప్టెన్ తిరిగి రావడంతో జట్టులో నూతనోత్సాహం నెలకొంది. అయితే ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు సాధించడమే కాకుండా, ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం గుజరాత్కు పెద్ద టాస్క్. ఢిల్లీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది, కాబట్టి ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ రాకతో గుజరాత్ టైటాన్స్ జాతకం మారుతుందా? లేక ఢిల్లీ తన విజయ పరంపరను కొనసాగిస్తుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..