ఫిట్నెస్ పేరుతో ఆటకు దూరమైన విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్
ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.
Sunil gavaskar


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విదేశీ ప్లేయర్లు.. జట్టులో చేరకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్లో తమ పాత్రను పూర్తిగా పోషించని విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఈ సీజన్లో పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు వివిధ కారణాలతో ఇంకా తమ జట్లలో చేరని విషయం తెలిసిందే. మిచెల్ స్టార్క్ గాయం నుంచి కోలుకుంటుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా అతడికి ఎన్ఓసీ ఇవ్వలేదు. మరోవైపు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ తమ జట్లలో చేరినప్పటికీ మైదానంలోకి దిగలేదు. ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు ఎన్ఓసీ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. హసరంగ, పతిరణ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కామెరూన్ గ్రీన్ విషయం మరో ఎత్తు! ఈ సీజన్ వేలంలో గ్రీన్ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్గా అతడు రికార్డు సృష్టించాడు. కానీ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ను కేవలం బ్యాటింగ్కే పరిమితం చేస్తున్నారు. ఈ విషయంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గ్రీన్ను ఉద్దేశించి సునీల్ గావస్కర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘ఒక మ్యాచ్లో ఓ బౌలర్ వేసేది నాలుగు ఓవర్లే. మరి వాళ్లు అలా చేయకుండా అడ్డుకుంటున్నదేంటి?. ఒకవేళ ఆటగాడు ఫిట్గా లేకుంటే టోర్నీకి ముందే వైదొలగాలి. మరో ప్లేయర్ను ఎంచుకునే అవకాశం ఫ్రాంచైజీకి ఇవ్వాలి. ఈ విషయాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించాలి. బీసీసీఐ రంగంలోకి దిగాలి. తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో అమలు చేస్తోన్న నిబంధనల లాంటివే.. ఫిట్నెస్ పేరుతో మ్యాచ్లకు పూర్తిగా అందుబాటులో లేని ప్లేయర్ల కోసం ప్రవేశపెట్టాలి. పూర్తి అంకితభావంతో ఆడే ఆటగాళ్లు ఫ్రాంచైజీలకు కావాలి’ అని గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande