
రంగారెడ్డి, 01 మే (హి.స.)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద గల
ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఒకే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఓఆర్ఆర్ ఎగ్జిట్-16 సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న ఒక లారీని, వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు లారీ వెనుక భాగంలోకి దూసుకుపోయి ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. లోపల ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లారీ కింద చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు