
హనుమకొండ, 01 మే (హి.స.)
2023న రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ పేరిట అధికారమే లక్ష్యంగా దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అమలు చేయకుండా రైతులను మోసం చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా బీర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా వ్యవసాయాన్ని దండగ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మహత్యలకు కేరాఫ్ గా నిలిపారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 10 సంవత్సరాలు రైతు సంక్షేమమే లక్ష్యంగా విత్తనం నుంచి కొనుగోలు కేంద్రాల వరకు అన్ని తానై రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి అమలు చేయకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారు పై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 6న వరంగల్ కేంద్రంగా రైతు ప్రతినిధుల సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వారిని డమ్మీ చేసి పక్క జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ చార్జి పేరుతో ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల అధికారాలను లాక్కున్నారని తెలిపారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు వచ్చే కాంట్రాక్టుల మీద మాత్రమే రివ్యూ నిర్వహిస్తున్నారు. కానీ జిల్లా ప్రగతి పై రివ్యూ లేదు అని ఆరోపించారు.
మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో రైతులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని, మక్కలు దిక్కులేని పరిస్థితిల్లో రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన కరెంటు, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేకపోవడం లాంటి అనేక అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నెల 6న రైతు ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సును రైతులు విజయవంతం చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు