
న్యూఢిల్లీ, 12 మే (హి.స.)
నీట్ (NEET-UG 2026) పరీక్ష
నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ (Paper leak) ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన ఈ వైద్య విద్యా ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ప్రాథమిక విచారణలో తేలడం, లీక్ అయిన పత్రాలకు అసలు ప్రశ్నపత్రంతో పోలికలు ఉండటంతో పారదర్శకత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) కి అప్పగించింది.
రద్దు ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి లోకం భగ్గుమంది. పరీక్షా కేంద్రాల వద్ద చోటుచేసుకున్న అవకతవకలు, ఎన్టీఏ వైఫల్యాలను నిరసిస్తూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్తలు ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్టీఏను చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, రద్దయిన పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు