
న్యూఢిల్లీ:, 13 మే (హి.స.)
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్(Prateek Yadav) మృతిచెందారు. ఆయన వయసు 38 ఏళ్లు. ఇవాళ తెల్లవారుజాము లక్నో సివిల్ ఆస్పత్రికి ఆయన్ను తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ బీజేపీ నేత. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్కు ప్రతీక్ సవతి సోదరుడు అవుతాడు. ఇవాళ ఉదయం 6.15 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. మృతికి కారణాలను వెల్లడించనున్నారు. ప్రాథమికంగా శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు.
ప్రతీక్ యాదవ్ చాన్నాళ్ల నుంచి శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టింది. దీని కోసం ఆయన చాన్నాళ్ల నుంచి చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యులు తక్షణమే ప్రతీక్ను సివిల్ ఆస్పత్రికి తరలించారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన కుమారుడే ప్రతీక్ యాదవ్. బ్రిటన్లోని లీడ్స్ వర్సిటీలో ప్రతీక్ ఎంబీఏ చదివారు. రియల్ ఎస్టేట్ డెవలపర్గా, ఫిట్నెస్ ఇష్టపడే వ్యక్తిగా అతనికి పేరున్నది. 2012 సెప్టెంబర్లో బాడీబిల్డింగ్కు చెందిన అంతర్జాతీయ వెబ్సైట్లో దర్శనమిచ్చాడు. జంతువుల సంరక్షణ పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. 2017లో లాంబోర్గిని కారు కొన్న కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. సోషలిజం అని చెప్పుకునే పార్టీకి చెందిన వ్యక్తి ఎలా ఖరీదైన కారు కొంటాడని కొందరు ప్రశ్నించారు.
ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య మాలతి దేవి. వారికి అఖిలేశ్ యాదవ్ జన్మించారు. అయితే అఖిలేశ్కు జన్మనిచ్చే సమయంలో మాలతీ దేవి ఆరోగ్యం క్షీణించింది. ఆమె 2003లో మరణించారు. మొదటి భార్య మరణించిన కొన్ని నెలల్లోనే 2003 మేలో సాధనను ములాయం సింగ్ యాదవ్ పెళ్లి చేసుకున్నారు. అయితే సాధన 1987లో చంద్ర ప్రకాశ్ గుప్తా అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ప్రతీక్ గుప్తా జన్మించారు. ప్రతీక్ పుట్టిన ఏడాది తర్వాత తన భర్తకు సాధన విడాకులు ఇచ్చేసింది. 1990లో వారికి విడాకులు మంజూరీ అయ్యాయి. 2002లో సాధన మృతిచెందింది.
2011లో ప్రతీక్, అపర్ణ పెళ్లి చేసుకున్నారు. అపర్ణకు విడాకులు ఇవ్వనున్నట్లు జనవరిలో ప్రతీక్ ప్రకటించాడు. తమ కుటుంబాన్ని ఆమె చిన్నాభిన్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. ఫేమస్ కావాలన్న తపనతో అపర్ణ తన కుటుంబాన్ని నాశనం చేసినట్లు తన ఇన్స్టా పోస్టులో ప్రతీక్ ఆరోపించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi