
చెన్నై: , 13 మే (హి.స.)
తమిళనాడు అసెంబ్లీలో(Tamilnadu Assembly) సీఎం విజయ్ విశ్వాస పరీక్ష వేళ.. అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలింది. తన మెజారిటీ నిరూపించుకునేందుకు ఇవాళ సీఎం విజయ్ .. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలు ప్రసంగం చేశాయి. అయితే అన్నాడీఎంకే తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కే పళనిస్వామి.. విశ్వాస పరీక్షను వ్యతిరేకించారు. సీఎం విజయ్కు వ్యతిరేకంగా తమ పార్టీ ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పళనిస్వామి చెప్పారు. అయితే రెబల్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సీఎం కలవడం ఎంత వరకు న్యాయమైందని ఆయన ప్రశ్నించారు.
పళనిస్వామి స్టేట్మెంట్తో సభలో అరుపులు మొదలయ్యాయి. ఈ దశలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ జోక్యం చేసుకున్నారు. బలపరీక్షపై అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణిని మాట్లాడమని కోరారు. కొందరు అన్నాడీఎంకే అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించారు. అయితే ఏ సభ్యుడితోనైనా మాట్లాడించే అధికారం తనకు ఉందని స్పీకర్ తెలిపారు. తీవ్ర వ్యతిరేకత మధ్య వేలుమని ప్రసంగించారు. ఆయన టీవీకేకు తన మద్దతును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విజయ్కు ఓటు వేశారని, అందుకే అన్నాడీఎంకే బలపరీక్షకు మద్దతు ప్రకటిస్తోందని వేలుమణి అన్నారు.
ఇక డీఎంకే పార్టీ.. వాకౌట్ చేసింది. తీర్మానంపై ప్రతిపక్ష నేత , డీఎంకే పార్టీ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం విజయ్ కలవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఛేంజ్ జరుగుతోందా, ఎక్స్చేంజ్ జరుగుతోందా అని ఉదయనిధి ప్రశ్నించారు. స్వచ్ఛమైన పాలన అంటే ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారని స్టాలిన్ తెలిపారు. ట్రస్ట్ ఓట్ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi