
గౌహతి: 12 మే (హి.స.)అస్సాం రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలయ్యింది. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణం ఈ అద్భుత ఘట్టానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజకీయాల్లో కాంగ్రెసేతర నాయకుడెవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 57 ఏళ్ల శర్మ ఆ రికార్డును తిరగరాశారు. గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పటికీ, ఆ పదవీకాలాల మధ్య విరామం ఉంది. తద్వారా వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా శర్మ రికార్డు సృష్టించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ