
చెన్నై12 మే (హి.స.)తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ (Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. విజయ్ నిర్ణయంతో 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
ఈ మేరకు మంగళవారం తమిళనాడు (TamilNadu) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 తస్మాక్ మద్యం రిటైల్ దుకాణాలు ఉన్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించిన 717 దుకాణాల్లో.. 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యాసంస్థలు, మరో 255 బస్స్టాండ్ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ తాజా ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ