
చెన్నై:, 13 మే (హి.స.)
తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ సీఎం విజయ్(CM Vijay) బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబల్స్ .. టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. కానీ పళనిస్వామి వర్గం మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది. టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో నెగ్గింది. విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే.. బలపరీక్షలో పాల్గొనలేదు. అయితే విశ్వాసపరీక్ష కన్నా ముందే కాంగ్రెస్తో పాటు వామపక్షాలు విజయ్కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో 117 మ్యాజిక్ మార్క్.
హార్స్ ట్రేడింగ్కు పాల్పడం..
బలపరీక్షపై చర్చ తర్వాత తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడారు. తమ సర్కారు సెక్యూలర్ విధానానికి కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం వేగవంతమైన గుర్రం తరహాలో పనిచేస్తుందని, కానీ హార్స్ ట్రేడింగ్కు పాల్పడదని చెప్పారు. గత ప్రభుత్వాలకు చెందిన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పార్టీలకు చెందిన సభ్యులు విశ్వాస పరీక్ష చర్చలో పాల్గొన్న తర్వాత విజయ్ మాట్లాడారు. ఓటింగ్కు ముందు సభా డోర్లను మూసివేయాలని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఎవరి సీట్లలో వారే కూర్చున్నారు. బ్లాక్ వారిగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi