
నల్గొండ, 14 మే (హి.స.)
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి నగర ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్, నగర మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి కోరారు. జనాభా గణన, గృహ జాబితా స్వీకరణలో భాగంగా గురువారం మేయర్, కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాసాలకు వెళ్లి గృహ జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేసి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా అధికారులకు సహకరించాలని కోరారు. జనాభా గణన ఆధారంగా భవిష్యత్ ప్రభుత్వ సంక్షేమ, మౌలిక వసతులు మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించబడతాయని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రతి కుటుంబం ఖచ్చితమైన సమాచారాన్ని అందించి జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు