
న్యూఢిల్లీ, 15 మే (హి.స.)
దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన లోపాల వల్ల సామాన్య ప్రజలు భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తోంది మోదీ ప్రభుత్వమని.. కానీ దానికి భారీగా మూల్యం చెల్లించుకుంటోంది మాత్రం దేశ ప్రజలని రాహుల్ గాంధీ 'X' (ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు. ప్రస్తుత ధరలు పెంపును ఆయన ఒక వినూత్న 'వసూళ్లు'(Vasooli)గా అభివర్ణించారు. ఇప్పటికే లీటరుకు రూ.3 మేర భారం వేసి మొదటి షాక్ ఇచ్చారని, మిగిలిన వసూళ్లను రాబోయే రోజుల్లో కిస్తీల రూపంలో ప్రజల నుంచి లాక్కుంటారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా ధరలను తగ్గించి, ఎన్నికలు ముగియగానే మళ్లీ సామాన్యుల నడ్డి విరుస్తారని తాను గతంలోనే హెచ్చరించానని రాహుల్ గాంధీ అన్నారు. కానీ తీరా చూస్తే.. ఇప్పుడు అదే నిజమైందని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్తో పాటు కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల పెంపును కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
కాగా, పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు పెరగడంతో, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 మేర పెంచాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు 20 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినప్పటికీ, భారత్లో కేవలం 3.2 శాతం నుంచి 3.4 శాతం లోపే నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం ధరల పెంపును సమర్థించుకుంటోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు