
నిజామాబాద్, 18 మే (హి.స.)
వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్ సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల నిర్వహణలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. విపత్తుల సమయాలలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను మరిపించేలా కొనసాగాయి. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, విపత్తుల సమయాలలో ఏ విధంగా వ్యవహరించాలన్నది కళ్ళకు కట్టినట్టు ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్ లు, వాటర్ బోట్ లు, అంబులెన్స్ లు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణ పై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయి. ఆయా అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఆపదమిత్ర వాలంటీర్లు మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖిల్లా రఘునాథ చెరువు వద్ద రెండు చోట్ల ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్ సైజ్ జరిపారు. రఘునాథ చెరువు వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహం కారణంగా చెరువు నీటిలో బాధితులు చిక్కుకున్న సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన
తక్షణ చర్యలను వాస్తవిక రూపంలో మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేసి చూపించారు. చెరువులో మునిగిపోతున్న వారిని డ్రోన్ల సహాయంతో గుర్తిస్తూ, బోట్ల ద్వారా ఎస్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది వారిని కాపాడడం, ఒడ్డుకు చేర్చిన వెంటనే వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స జరిపి అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించడం వంటి సహాయక చర్యలు అధికార యంత్రాంగం సన్నద్ధతను నిరూపించాయి. సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు.
జలాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వరద చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషెంట్లను హుటాహుటిన పై అంతస్తులకు చేర్చి, వారి ప్రాణాలను ఎలా కాపాడాలి అనే దాని పై మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా ఆచరణాత్మక రీతిలో చేసి చూపించారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్ తదితరులు పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు