అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువతి దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువతి దుర్మరణం
Road accident


నల్గొండ, 18 మే (హి.స.)

ఉన్నత ఆశయాలతో చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగమ్మాయిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నల్గొండ జిల్లాకు చెందిన యువతి షికాగోలో జరిగిన ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడసు శ్రీనివాల్రెడ్డి కుమార్తె నవ్య (24) ఉన్నత విద్య కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. ఎంఎస్ (MS) పూర్తి చేసి, ప్రస్తుతం అక్కడ ఓ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. విధి నిర్వహణ అనంతరం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

చేతికొచ్చిన కూతురు అకస్మాత్తుగా, ఊహించని రీతిలో మృత్యువాత పడటంతో చెరువుగట్టులో తీవ్ర నవ్య విషాద స్వగ్రామం ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నవ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande