
నల్గొండ, 02 మే (హి.స.)
జీవితంలో ఉన్నత లక్ష్యాలను
చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నివారణ పై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్, చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద శనివారం ఉదయం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే విజయాన్ని సాధించగలరని తెలిపారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ వినియోగం పై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం చట్టంపరంగా నేరమని, ఎవరైనా అలాంటి వాటిని ఆఫర్ చేస్తే తిరస్కరించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి తీవ్రహానిని కలిగిస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువత చెడుస్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాలు దెబ్బతింటాయని, మానసికంగా ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. చదువు పై దృష్టి కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..