రాష్ట్రంలో.వారం.రోజులుగా పెరుగుతున్న.ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో.వారం.రోజులుగా పెరుగుతున్న.ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో.వారం.రోజులుగా పెరుగుతున్న.ఉష్ణోగ్రతలు


అమరావతి, 25 మే (హి.స.)

తణుకు, రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఉక్కపోతతో ఫారాల్లో లేయర్ కోళ్లు(గుడ్లు పెట్టేవి) పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతుండటం పౌల్ట్రీ రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏటా వేసవిలో కోళ్ల మరణాలు సాధారణమైనా ఈ ఏడాది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుండగా.. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఛైర్మన్ కోమటపల్లి సుబ్బారావు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కోళ్లు మరణించాయన్నారు. ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మూడు లక్షల కోళ్లు చనిపోయినట్లు వెల్లడించారు.

తగ్గిన గుడ్ల ఉత్పత్తి

సాధారణ రోజుల్లో 90 శాతం గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. ప్రస్తుతం 55-60 శాతం కోళ్లు మాత్రమే గుడ్లు పెడుతున్నాయి. నెల రోజుల కిందట మేత ధరలు పెరగడం, మరో పక్క ఉత్పత్తి పడిపోవడంతో గుడ్డు ధర (రూ.5) గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎక్కువ ప్రీమియం చెల్లించినా.. కోళ్లు మృతి చెందాక కంపెనీల నుంచి పరిహారం రాకపోవడంతో రైతులు బీమా చేయించుకోవడం లేదు. దీంతో కోళ్లు మృత్యువాత పడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మేత ధరలపై రాయితీ సహా అన్ని రకాలుగా పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సుబ్బారావు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande